Pulse Polio Drive: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలనే లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54,07,663 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో హాజరవుతారు. అదే సమయంలో కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధి మళ్లీ దేశంలోకి రాకుండా నిరోధించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: Christ: దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం … తెలుగు రాష్ట్రాల పక్కనే
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38,267 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజలు ఎక్కువగా చేరే ప్రాంతాల్లో ఈ బూత్‌లు అందుబాటులో ఉన్నాయి. పోలియో కార్యక్రమం సజావుగా సాగేందుకు జిల్లాలన్నింటికీ అవసరమైన వ్యాక్సిన్ డోస్‌లను ముందుగానే సరఫరా చేశారు. మొత్తం 98,99,300 డోస్‌లను జిల్లాలకు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఒకవేళ నేడు బూత్‌లకు వచ్చి పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు చుక్కలు వేస్తారు. ఇందుకోసం 76,534 బృందాలను రంగంలోకి దించారు. చుక్కలు వేసిన ఇళ్లపై ‘P’ గుర్తు, వేయని ఇళ్లపై ‘X’ గుర్తు వేస్తూ పర్యవేక్షణ చేపడతారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. చిన్నారుల భవిష్యత్తును కాపాడే ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఈ వివరాలను వెల్లడించారు.

