TVK Party

TVK Party: దళపతి విజయ్‌కి మరో షాక్.. పుదుచ్చేరి సభకు కఠిన ఆంక్షలు, తమిళనాడు వారికి నో ఎంట్రీ!

TVK Party: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు దళపతి విజయ్కి పుదుచ్చేరి పోలీసులు మరోసారి గట్టి షాక్ ఇచ్చారు. మంగళవారం (డిసెంబర్ 9న) పుదుచ్చేరిలోని న్యూ పోర్ట్ ఎక్స్‌పో గ్రౌండ్‌లో జరగనున్న ఆయన రాజకీయ సభకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 27న కరూరు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసులు పకడ్బందీ మార్గదర్శకాలను రూపొందించారు.

కేవలం పుదుచ్చేరి వారికే అనుమతి

ఈ సభకు పుదుచ్చేరి ప్రజలకు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వబడింది. తమిళనాడు నుంచి ఒక్క కార్యకర్త కూడా సభ స్థలికి రాకూడదని, ఒకవేళ వచ్చినా వారికి ప్రవేశం లేదని పుదుచ్చేరి పోలీసులు స్పష్టం చేశారు. సభకు కేవలం 5,000 మందికి మాత్రమే అనుమతి మంజూరు చేశారు. TVK జారీ చేసిన QR కోడ్ కలిగిన పాస్‌లు ఉన్నవారికి మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది. పాస్ లేనివారికి ఎంతమాత్రం అనుమతి ఉండదు.

ఉదయం 12:30 గంటలకే ముగించాలి!

ఈ సభను ఉదయం 12:30 గంటలకు ముందే ముగించాలని పోలీసులు నిర్వాహకులను ఆదేశించారు. భారీ జనసందోహం, రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు 500 మంది సామర్థ్యంతో వేర్వేరు ఎన్‌క్లోజర్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు

భద్రత విషయంలో కఠిన నిబంధనలు

కరూరు లాంటి దుర్ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా..

పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు సభలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించారు. సభ ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్‌లు, ఫైర్ ఇంజిన్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు (ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు) వంటి అన్ని భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని TVK నిర్వాహకులకు పోలీసులు సూచించారు.

వాహనాల పార్కింగ్‌కు కేవలం మూడు ప్రాంతాలు (పొండి మరీనా, స్టేడియం వెనుక ప్రాంతం, ఓల్డ్ పోర్ట్ ఏరియా) మాత్రమే కేటాయించారు. టీవీకే కార్యకర్తలు రోడ్లపై వాహనాలు నిలపడం పూర్తిగా నిషేధించబడింది.

దళపతి విజయ్ రాజకీయ ప్రయాణంలో ఈ తాజా ఆంక్షలు ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులలో చర్చనీయాంశమయ్యాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *