America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మరోసారి అమెరికా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, లాస్ ఏంజెల్స్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ ట్రంప్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు.
వైట్ హౌస్ ఎదుట కూడా నిరసనలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ పౌరహక్కులను, చట్ట వ్యవస్థను తుంచిపారేస్తున్నారని ఆరోపించారు. ఆయన తీసుకున్న సుంకాలు, ఉద్యోగాల తొలగింపు వంటి నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఉద్యమానికి ‘50501’ అనే పేరును ఇచ్చారు. దీని అర్థం – 50 నిరసనలు, 50 రాష్ట్రాల్లో, ఒకే ఒక్క ఉద్యమం అనే సందేశాన్ని కలిగిస్తుంది. “అమెరికాలో రాజులు లేరు”, “ఫ్యూడల్ యుగం ముగిసింది” వంటి నినాదాలతో ప్రజలు ప్రదర్శనలు చేశారు.
గత నెల అరెస్టైన పాలస్తీనా అనుకూల విద్యార్థి మహమూద్ ఖలీల్‌ను విడుదల చేయాలని కూడా వారు కోరారు. ఉక్రెయిన్ మరియు గాజా యుద్ధాలపై ట్రంప్ వైఖరిని తిరగమార్చాలని డిమాండ్ చేశారు.
ఇది ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన రెండో నిరసన. ఇంతకు ముందు ఏప్రిల్ 5న దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించారు.