Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందూ ధర్మ రక్షణపై సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి భక్తుడికీ తన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ఆయన ఒక సంచలన పోస్ట్‌ను పంచుకున్నారు. సాధారణంగా హిందువులు తమ దేవుళ్లను ఎవరైనా అవమానించినప్పుడు ఆ బాధను వ్యక్తిగతంగానే అనుభవిస్తూ, ఎవరు చేసిన కర్మను వారే అనుభవిస్తారనే ఉదాసీన వైఖరితో ఉంటారని, అయితే ఈ ధోరణి ఇకపై మారాలని ఆయన పిలుపునిచ్చారు.
మనం కులాలు, ప్రాంతాలు, భాషల పరంగా విభజించబడి ఉన్నప్పటికీ, మనమంతా నమ్మే హిందూ ధర్మం ఒక్కటేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మన విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు మౌనంగా ఉండటం సరికాదని, భక్తులుగా మాత్రమే కాకుండా ధర్మ రక్షకులుగా కూడా గొంతెత్తాలని ఆయన సూచించారు. తన సందేశం ఏ ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, స్వధర్మాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని ఆయన వివరించారు. దేవుడిపై భయం, ధర్మంపై గౌరవం ఉన్న ప్రతి హిందువు ఇకపై బాధ్యతాయుతంగా స్పందించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
