Dasari Kiran: ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ఆర్థిక లావాదేవీల వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడ పటమట పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసి, విచారణ కోసం విజయవాడకు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే… కిరణ్ బంధువు గాజుల మహేశ్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఆయన వద్ద దాసరి కిరణ్ రెండు సంవత్సరాల క్రితం సుమారు రూ.4.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు సమాచారం. గడువు ముగిసినా అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో మహేశ్ పలుమార్లు డబ్బు అడిగారు. అయితే కిరణ్ పట్టించుకోకపోవడంతో ఈ నెల 18న మహేశ్ భార్యతో కలిసి విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లారు.
ఇది కూడా చదవండి: Medaram Maha Jatara: మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధుల మంజూరు
అక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహేశ్ ఆరోపణల ప్రకారం, కిరణ్ అనుచరులుగా ఉన్న దాదాపు 15 మంది వారిని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేయించారన్న ఆరోపణలతోపాటు, అప్పు తిరిగి ఇవ్వకపోవడం విషయంలోనూ కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేసి, కిరణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.