Belli Janardhan: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర నిర్మాత బెల్లి జనార్ధన్ ప్రమాదవశాత్తు మరణించారు. ఇటీవల తూలికా తనిస్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమా నిర్మించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, ఇంతలోనే లోకాన్ని విడిచి వెళ్లడం అందరినీ కలిచివేస్తోంది. ఆయన మరణవార్త విని సినీ ప్రముఖులు, ముఖ్యంగా ఆ చిత్ర దర్శకుడు బాబ్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ విషాద ఘటన ఉగాది పండుగ రోజున జరిగింది. పండుగ సంబరాల కోసం జనార్ధన్ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారి ఊరైన కట్టంగూరుకు వెళ్లారు. అక్కడ సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ప్రమాదం సంభవించింది. నీటి అడుగు భాగానికి తల బలంగా తగలడంతో తీవ్ర గాయమై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సంతోషంగా గడపాల్సిన పండుగ పూట ఇలాంటి ఘటన జరగడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
బెల్లి జనార్ధన్ గతంలో దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుడు. ఆయన మృతికి గౌరవసూచకంగా నకిరేకల్ మండలంలోని ఆయన స్వగ్రామం ‘పాలెం’లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, ఒక మంచి మనిషిని, అభిరుచి గల నిర్మాతను కోల్పోవడం బాధాకరమని అన్నారు. ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర బృందం తరపున ఆయన కుటుంబానికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు.
