Rahul Gandhi: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం ముజఫర్‌పుర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో ప్రియాంక గాంధీని వెనక కూర్చోబెట్టుకుని నడపడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్‌తో పాటు ఇతర ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ యాత్ర ఆగస్టు 17న ససారామ్‌లో మొదలై, మొత్తం 1300 కిలోమీటర్లు ప్రయాణించి సెప్టెంబర్ 1న ముగుస్తుంది. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటున్నారు. బుధవారం జరిగిన సభలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంగళవారం జరిగిన ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి వచ్చిన నిండు గర్భిణి ప్రసవం
ఈ యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రజలు తమ ఓటుహక్కును కాపాడుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఇది ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
బిహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశం పార్లమెంట్ సమావేశాల్లో కూడా చర్చకు వచ్చింది. రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ ఈ ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
— Congress (@INCIndia) August 27, 2025

