Priyanka Gandhi: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ఢిల్లీ ప్రజలు “మార్పు” కోసం ఓటు వేసినట్లు పేర్కొన్నారు. రాజధాని ప్రజలు కొత్త మార్గాన్ని కోరుకున్నారని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో విసిగిపోయారని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకున్నారని, అదే ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె గెలిచిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక, ఇకపై కాంగ్రెస్ పార్టీ మరింత కష్టపడి పనిచేయాలని, ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రియాంకా గాంధీ మూడు రోజుల పర్యటనలో భాగంగా కేరళలోని వయనాడ్‌లో ఉన్నారు. ఇటీవలే ఆమె వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
27 సంవత్సరాల తరువాత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై భారీ మెజారిటీతో గెలిచి, ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. వరుసగా మూడోసారి ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయిది.