Priyanka Gandhi: ఉపాధి హక్కును బలహీనపరుస్తున్నా

Priyanka Gandhi: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు.

లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు–2025’ గ్రామీణ ప్రజల ఉపాధి హక్కును బలహీనపరుస్తుందని ప్రియాంక ఆరోపించారు. రూల్ 72(1) కింద ఈ బిల్లుపై తమ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన చట్టాన్ని ఈ కొత్త బిల్లు దెబ్బతీస్తోందని ఆమె అన్నారు. ఇప్పటివరకు డిమాండ్ ఆధారంగా నిధులు కేటాయించే విధానం ఉండగా, కొత్త చట్టంతో కేంద్రం ముందుగానే నిధులను నిర్ణయించేలా మారుస్తున్నారని విమర్శించారు. దీనివల్ల గ్రామ సభల పాత్ర తగ్గిపోతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

అదే సమయంలో చాలా రాష్ట్రాల్లో కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జీఎస్టీ బకాయిల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రాలకు ఇది మరింత నష్టం కలిగిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ట్రెజరీ బెంచీల నుంచి ‘కుటుంబం’పై వ్యాఖ్యలు రావడంతో ప్రియాంక ఘాటుగా స్పందించారు.“మహాత్మా గాంధీ నా కుటుంబ సభ్యుడు కాకపోయినా, నా కుటుంబ సభ్యుడిలానే. దేశం మొత్తం ఆయనను అలాగే భావిస్తుంది” అని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు, ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ… ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగానే ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపాయి. డిమాండ్ ఆధారిత విధానం వల్ల బడ్జెట్‌లో అనిశ్చితి ఏర్పడుతుందని, కొత్త విధానంతో పక్కా ప్రణాళికతో నిధులు కేటాయించవచ్చని పేర్కొన్నాయి.

కాగా, 2005లో యూపీఏ ప్రభుత్వం MGNREGA చట్టాన్ని తీసుకురాగా, ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ ఫొటోలతో నిరసన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *