Bus Accident

Bus Accident: కొవ్వూరు ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ప్రైవేట్ బస్సు పూర్తిగా దగ్ధం

Bus Accident: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై బుధవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఈ బస్సు వంతెన పైకి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బస్సులో మంటలు చెలరేగడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. దీంతో లోపల ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులోని సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా క్షేమంగా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీనివల్ల సుమారు రూ. 80 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక అధికారి వేణు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. కాగా, బస్సులోని ప్రయాణికులను మరో వాహనంలో సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపించారు. అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ వల్ల పెను ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *