Prithvi Raj: కమెడియన్ పృథ్వీ ఇటీవల ‘లైలా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, పృథ్వీపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ, ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, పృథ్వీ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనను తీవ్రంగా వేధిస్తున్నారని, ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా తనను, తన కుటుంబాన్ని అవమానిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
పృథ్వీ ఆరోపణల ప్రకారం, వైసీపీ సోషల్ మీడియా విభాగం తన ఫోన్ నంబర్‌ను గ్రూపుల్లో పంచిపెట్టడంతో, సుమారు 1,800 కాల్స్ వచ్చాయని, ఈ కాల్స్‌లో తిట్టిపోశారని తెలిపారు. దీంతో, అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని వాపోయారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించానని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితను కలసి, వేధింపులకు పాల్పడిన వారిపై రూ.1 కోటి పరువునష్టం దావా వేయనున్నట్లు పృథ్వీ స్పష్టం చేశారు.