Medipally Swathi Murder: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గర్భిణి హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఐదు నెలల గర్భిణీ అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా హత్య చేసి ముక్కలుగా చేసి మూసీ నదిలో పారేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ఘటనను మల్కాజిగిరి డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు.
ప్రేమతో మొదలైన పెళ్లి – ఘర్షణలకు దారితీసింది
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి (27), స్వాతి (21) చిన్ననాటి నుండి పరిచయం ఉన్నవారే. కుల భేదం కారణంగా పెద్దలు మొదట్లో అడ్డుకున్నా, ప్రేమను కొనసాగిస్తూ 2023 జనవరిలో ఆర్యసమాజ్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో మళ్లీ వివాహం జరిపి బోడుప్పల్ బాలాజీనగర్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు.
మహేందర్ ర్యాపిడో డ్రైవర్‌గా, స్వాతి టెలికాలర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. కానీ పెళ్లైన కొద్ది నెలల్లోనే వీరి మధ్య కలహాలు మొదలయ్యాయి.
వేధింపులు – గృహహింస కేసు
స్వాతి గర్భవతి అయినప్పుడు మహేందర్ బలవంతంగా అబార్షన్ చేయించాడని సమాచారం. దీంతో విసిగిపోయిన స్వాతి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది. రాజీ కుదిరిన తర్వాత కూడా మహేందర్ మారలేదు. స్వాతి తల్లిదండ్రులతో మాట్లాడనీయకుండా, ఆమెపై కఠిన నియంత్రణలు పెట్టేవాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Korutla Jagityala BJP: కోరుట్ల, జగిత్యాల వైపు కమలనాథులు కన్నెత్తి చూడట్లేదా?
వినాయక చవితి ముందే దారుణం
ఇటీవల స్వాతి మళ్లీ గర్భవతి అయ్యింది. వినాయక చవితికి వైద్య పరీక్షల కోసం పుట్టింటికి వెళ్లాలని కోరినప్పటికీ మహేందర్ అంగీకరించలేదు. ఆగస్టు 23న ఉదయం గొడవలు మరింత తీవ్రమయ్యాయి. మధ్యాహ్నం బయటికి వెళ్లి వచ్చిన మహేందర్, హ్యాక్సా బ్లేడు కొనుగోలు చేసి స్వాతిని గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై శవాన్ని ముక్కలుగా చేసి కవర్లలో కట్టి మూడు విడతలుగా మూసీ నదిలో పడేశాడు.
మెుండెం దాచలేక నాటకం
మృతదేహంలోని మెుండెం మాయం చేయలేక ఇంట్లోనే ఉంచిన మహేందర్, భార్య కనిపించడం లేదని పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ మేడిపల్లి పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీ చేయగా మూటలో మెుండెం దొరకడంతో అసలు నేరం బయటపడింది.
పోలీసుల చర్యలు – కుటుంబం ఆవేదన
మహేందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. వరదల కారణంగా మూసీలో పడేసిన శరీర భాగాలు ఇంకా కనుగొనబడలేదు. ప్రస్తుతం మెుండెంపై పోస్టుమార్టం జరుగుతోంది.
తమ కూతుర్ని ఇంత క్రూరంగా హతమార్చిన మహేందర్ రెడ్డిని ఉరి తీయాలని స్వాతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

