Prakash Raj: బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురందర్: ది రివెంజ్’ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు వస్తున్న స్పందన కంటే, దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి వారు ఈ సినిమాను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. సినిమా చాలా బాగుందని, రణవీర్ సింగ్ నటన అద్భుతమని వారు కొనియాడారు. అయితే, ఇదే సమయంలో బాలీవుడ్ అగ్ర హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు ఈ సినిమాపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లలో చర్చ మొదలైంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించగా, ఆయన తనదైన శైలిలో షాకింగ్ రిప్లై ఇచ్చారు.
దక్షిణాది హీరోల ప్రశంసల వెనుక ఏదో బలవంతం లేదా ప్రయోజనం ఉందనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ స్పందించారు. “దక్షిణాదికి సైతం ఆబ్లిగేషన్ (మర్యాద కోసం చేసే పని) వ్యాపించినట్టుగా ఉంది” అంటూ ఆయన సెటైర్ వేశారు. అంటే మన హీరోలు ఎవరో చెప్పడం వల్లే లేదా మొహమాటానికి పోయే ఈ సినిమాను పొగుడుతున్నారనేది ఆయన ఆరోపణ. తాను మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతూ, నెటిజన్లను ఉద్దేశించి “మీరు కూడా దూరంగా ఉంటారా?” అంటూ తన ట్రేడ్ మార్క్ హాష్ ట్యాగ్ #justasking తో ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తున్నాయి. మన హీరోల అభిప్రాయాలను తప్పుబట్టడం సరికాదని కొందరు అంటుంటే, బాలీవుడ్ హీరోలు మౌనంగా ఉండటం వెనుక కారణమేంటని మరికొందరు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ‘ధురందర్ 2’ సినిమా ఫలితం కంటే ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K
— Prakash Raj (@prakashraaj) March 19, 2026
