Earthquake: అలాస్కా – కెనడా భూభాగమైన యుకాన్ సరిహద్దుల సమీపంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఇటీవల శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0 గా నమోదైంది.
యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, స్థానిక సమయం 11:41AM తర్వాత దాదాపు 30 సార్లు ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి సుమారు 6 మైళ్ల (10 కిలోమీటర్లు) లోతులో ఉంది. అయితే, ఈ భూకంపం కారణంగా ఎక్కడా సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. అలాగే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం నివేదికలు అందలేదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: CM Chandrababu: పవిత్ర ఆలయాల్లో చోరీ చిన్న విషయమా? దొంగతో సెటిల్‌మెంట్ మహాపాపం – సీఎం చంద్రబాబు
భూకంప కేంద్రం అలాస్కాలోని జూనోకు వాయువ్యంగా 370 కిలోమీటర్లు, యుకాన్ రాజధాని వైట్‌హార్స్‌కు పశ్చిమాన 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుకాన్ ప్రాంతంలో భూకంప కేంద్రానికి దగ్గరగా హేన్స్ జంక్షన్ అనే ప్రాంతం ఉంది. యుకాన్ రాజధాని వైట్‌హార్స్‌లో భూమి బలంగా కంపించిన అనుభూతి కలిగిందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) అధికారులు తెలిపారు. చాలా చోట్ల వస్తువులు అల్మారాల నుండి కింద పడ్డాయని మాత్రమే ప్రజలు తెలిపారు.

