Nampally

Nampally: నాంపల్లిలో ఆగని అగ్నికీలలు.. 48 గంటల్లోనే రెండో ప్రమాదం!

Nampally: హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతం వరుస అగ్నిప్రమాదాలతో ఉలిక్కిపడుతోంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే రెండు చోట్ల మంటలు చెలరేగడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మొన్నటి భారీ ప్రమాద ఘటన మరువకముందే, తాజాగా విజయ్ నగర్ కాలనీలో మరో ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ వరుస ఘటనలు రద్దీ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై పలవురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

తాజా ఘటన వివరాల్లోకి వెళ్తే.. విజయ్ నగర్ కాలనీలోని ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో వెలువడిన నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఐటీఐ గ్రిడ్ ప్రాంతంలోని ఒక డెంటింగ్ పెయింట్ షాపుపై పడ్డాయి. దీనివల్ల షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న ఒక టొయోటా క్రిస్టా, ఒక ఫోర్డ్ ఎండీవర్ కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.

అయితే, దీనికి రెండు రోజుల ముందే నాంపల్లి ప్రధాన రహదారిలో జరిగిన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక నాలుగు అంతస్తుల ఫర్నిచర్ షోరూమ్‌లో చెలరేగిన మంటలు భవనం మొత్తాన్ని కమ్మేశాయి. ఈ ఘటనలో దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. సుమారు 22 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఈ మంటల్లో చిక్కుకుని ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) గా గుర్తించారు.

వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలతో నాంపల్లి పరిసర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు స్పందించి రద్దీ ప్రాంతాల్లోని విద్యుత్ లైన్లను, అగ్నిమాపక వ్యవస్థలను తనిఖీ చేయాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *