Chandrababu

Chandrababu: అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు!

Chandrababu: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. తుళ్లూరు సమీపంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.

అమరజీవి త్యాగానికి ప్రతిరూపం

ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న స్మృతివనంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న తొలి భారీ విగ్రహం ఇదే కావడం గమనార్హం.

ఈ విగ్రహ తయారీలో సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించారు. దీని కోసం దాదాపు 26 టన్నుల కాంస్యం (Bronze), 42 టన్నుల ఇనుమును(iron) వినియోగించారు. అమరజీవి జయంతి వేడుకలను పురస్కరించుకుని స్మృతివనం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.

సచివాలయంలో కీలక సమీక్ష

విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 1:45 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) వేదికగా అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ పరిస్థితులు, రాష్ట్రంలో గ్యాస్ సరఫరా మరియు ఇతర అత్యవసర వస్తువుల లభ్యతపై ఆయన సమీక్షించే అవకాశం ఉంది.

సాయంత్రం ఇఫ్తార్ విందు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజయవాడలో ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. ఈ వేడుకలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *