Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్‌లో టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు పండుగల సమయంలో రవాణా సౌకర్యాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సద్దుల బతుకమ్మ (సెప్టెంబర్ 30) మరియు దసరా (అక్టోబర్ 2) సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువగా ఉండే ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ప్రయాణికులకు సరిపడిన బస్సులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి బస్ స్టేషన్‌లో ప్రత్యేక అధికారిని నియమించి, అక్కడి రద్దీని బట్టి అదనపు బస్సులను నడపాలని తెలిపారు.
ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తూ 97 డిపోలు, 340 బస్ స్టేషన్ల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు.
దసరా నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీని వలన సద్దుల బతుకమ్మ, దసరా పండుగల కోసం ఊర్లకు వెళ్లే ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగ్గా లభించనున్నాయి.