Ponnam Prabhakar: టీపీసీసీ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేర్చడం పార్టీ కార్యకర్తల ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్ వరకు బలమైన నెట్‌వర్క్ సిస్టమ్‌ను ఏర్పరచుకునేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడం, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం పై చర్చలు జరిగాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఓటు చోరీ అంశాలపై రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 15న కామారెడ్డిలో అభినందన సభ నిర్వహిస్తామని, అదే వేదికగా బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించనున్నామని చెప్పారు. రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అసలు వైఖరిని ప్రజలకు బహిర్గతం చేస్తామని ఆయన అన్నారు.
ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయని, అలాగే పార్టీ బలోపేతం కోసం సంస్థాగత స్థాయిలో చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
