Ponnam Prabhakar: కాలుష్య నియంత్రణే లక్ష్యం

Ponnam Prabhakar: ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, డీలర్లు, ఏజెన్సీలతో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రావద్దనే ఉద్దేశంతోనే జీవో నెంబర్–41 కింద ఈవీ పాలసీని అమల్లోకి తీసుకొచ్చామని వివరించారు. ఈ పాలసీ కింద ఇప్పటివరకు 1,59,304 ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు అందించామని, ఇందుకోసం రూ.806.35 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం కొంత నష్టాన్ని భరించినప్పటికీ, కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.

2047 నాటికి రాష్ట్రంలో పూర్తిగా ఈవీ వాహనాల వినియోగం ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల వేగంగా విస్తరిస్తున్న కొత్త కాలనీల దృష్ట్యా జీవో నెంబర్–263ను ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ జీవో కింద 20 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు, 10 వేల సీఎన్‌జీ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, 25 వేల రెట్రో ఫిటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు.

నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ఈవీ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కంపెనీలు, డీలర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

జనవరిలో నిర్వహించనున్న రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమాన్ని కంపెనీలు, డీలర్లు, ఏజెన్సీలు కలిసి నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. రోడ్ సేఫ్టీపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, పాఠశాల విద్యార్థులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈవీ వాహనాల వినియోగం పెరిగేలా ప్రభుత్వానికి ఈవీ కంపెనీలు పూర్తిస్థాయిలో సహకరించాలని, ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *