Ponguleti srinivas: తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని రెవెన్యూ, భూ పరిపాలన శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నలుగురు వ్యక్తుల స్వార్థం కోసం గతంలో ధరణి విధానాన్ని అమలు చేశారని ఆయన ఆరోపించారు.
రైతులు తమ భూములపై ఉన్న సమస్యలకు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఇకపై రావద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టంను తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా భూముల సమస్యలకు స్థిర పరిష్కారం లభించనుందని స్పష్టం చేశారు.
ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఇది భూముల రికార్డుల నిర్వహణను మెరుగుపరచడమే కాకుండా, రైతులకు తక్షణ సేవలు అందించే దిశగా సహాయపడుతుందని వివరించారు.
ఇప్పటివరకు కబ్జాలో ఉన్న భూములను బయటకు తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, అక్రమంగా ఉన్న భూములపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా బాగాలేకపోయినా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపట్టిందని తెలిపారు.
రైతులకు న్యాయం చేయాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని, భూసంబంధిత సమస్యలపై ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.