Ponglueti srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందన్నారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెండు సంవత్సరాల పాలనలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలిగామని అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి–సంక్షేమాలలో దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని పొంగులేటి వివరించారు. ఇందిర ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా ‘అభివృద్ధి–సంక్షేమం’ అనే రెండు చక్రాలపై ప్రగతిరథం ముందుకు సాగుతోందని అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడిన సమయంలో రాష్ట్రం అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉందని, గత పదేళ్లలో తీసుకున్న స్వార్ధపూరిత నిర్ణయాలతో తెలంగాణ ఆర్థికంగా దెబ్బతిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోనే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి, రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా వేగంగా నడిపిస్తున్నదని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీలలో నాలుగు పూర్తిగా అమలు చేశామని, మిగిలిన రెండు గ్యారంటీలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాక్షికంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే అన్ని గ్యారంటీలను పూర్తిగా అమలు చేయనున్నట్టుగా చెప్పారు.
రెండేళ్ల పాలనకు ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోంది అని కామెంట్ చేశారు. ఇటీవల జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకం ఎంత పెరిగిందో స్పష్టమైన ఉదాహరణలని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అదనపు సంక్షేమ పథకాలను కూడా తెస్తోందన్నారు.

