Ponglueti srinivas: పేదలకు సాగు భూములపై హక్కులు కల్పించాలి

Ponglueti srinivas: పేద ప్రజలు, గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ భూ సమస్యలపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్నచిన్న సమస్యలను చూపించి భూవివాదాలను సంక్లిష్టం చేయొద్దని అటవీ శాఖ అధికారులను హెచ్చరించారు. గత 40-50 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములపై గిరిజనులకు చట్టబద్ధ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

తిరుమలగిరి మండలంలో పైలట్ సర్వే

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించినట్లు మంత్రి వివరించారు. ఈ సర్వేలో 235 సర్వే నంబర్లను పరిశీలించగా, మొత్తం 23 వేల ఎకరాల భూమి గుర్తించారు. వీటిలో 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూములుగా తేలగా, 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

పాసుపుస్తకాల పరిస్థితి

ఆ 8 వేల ఎకరాల్లో 4 వేల ఎకరాలు ఇప్పటికే పాసుపుస్తకాల ఆధారంగా సాగులో ఉన్నాయని, మిగిలిన 4,037 ఎకరాలకు కొత్త పాసుపుస్తకాలు జారీ చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో, సర్వేలో 2,936 ఎకరాలకు సంబంధించి 3,069 మంది వద్ద బోగస్ పాసుపుస్తకాలు ఉన్నట్లు గుర్తించి, వాటిని రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే, వీరికి రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు నిలిపివేసినట్లు వివరించారు.

అటవీ భూముల సమస్యలు

సర్వేలో భాగంగా 7 వేల ఎకరాలు అటవీ భూములుగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ భూములపై ఉన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి కె.జానా రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కె.జయవీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయిక్‌తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *