New Year 2026

New Year 2026: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు.. పోలీసుల కట్టుదిట్టమైన ఆంక్షలు

New Year 2026: మరో కొన్ని రోజుల్లో భాగ్యనగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నగరవాసులు ఎంజాయ్‌మెంట్‌కు ప్లాన్ చేసుకుంటుండగా, పోలీసులు మాత్రం భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, రిసార్టులు, మరియు ఫామ్ హౌస్‌లపై పోలీసులు డేగ కన్నేసి ఉంచారు. వేడుకల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

ఈవెంట్ ఆర్గనైజర్లకు పోలీసుల అల్టిమేటం

న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సర్క్యులర్ జారీ చేశారు.

ఎల్లుండి నుంచి పర్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించరు. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలో ఉన్న సుమారు 70 పబ్స్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్లు, గేటెడ్ కమ్యూనిటీలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

మాదాపూర్ DCP రితిరాజ్ హెచ్చరికలు:

ఐటీ కారిడార్ ఈవెంట్ నిర్వాహకులతో సమావేశమైన మాదాపూర్ DCP రితిరాజ్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:

  1. మైనర్లకు నో ఎంట్రీ: పబ్స్‌లోకి మైనర్లను అనుమతించకూడదు.

  2. డ్రగ్స్ విషయంలో కఠినం: వేడుకల్లో డ్రగ్స్ వాడినా, లేదా ఆర్గనైజర్లు ప్రోత్సహించినా లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటారు.

  3. శబ్ద కాలుష్యం: డీజే పాటల విషయంలో పరిమితి దాటకూడదు.

  4. ఫైర్ సేఫ్టీ: ప్రతి ఈవెంట్ వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కెపాసిటీకి మించి పాస్‌లు అమ్మకూడదు.

ఫామ్ హౌస్‌లపై నిఘా: రాజేంద్రనగర్ DCP హెచ్చరిక

నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్ డివిజన్‌లో సుమారు 500కు పైగా ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం ఇవన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ DCP యోగేష్ గౌతమ్ ఫామ్ హౌస్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అనుమతి లేకుండా లిక్కర్ పార్టీలు నిర్వహించినా, డ్రగ్స్ వాడినా యజమానులదే బాధ్యత. ఫామ్ హౌస్‌లలో జరిగే ప్రతి యాక్టివిటీని పోలీసులు గమనిస్తుంటారు. అని ఆయన హెచ్చరించారు.

మందుబాబులకు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ షాక్

న్యూ ఇయర్ రాత్రి రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భారీ స్థాయిలో ఉండనున్నాయి. వేడుకలు జరుపుకునే వారు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాల సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలు, ఈవెంట్ నిర్వాహకులు సహకరించాలని కోరుతున్నారు. బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకొని కొత్త ఏడాదికి ఆహ్వానం పలకాలని పోలీసులు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *