Poonch LoC: జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ఒక మహిళను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. మంగళవారం సాయంత్రం సరిహద్దు నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న బాలాకోట్ సెక్టార్‌లోని డబ్బీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా భద్రతా దళాలు ఆమెను గుర్తించి అరెస్టు చేశాయి. విచారణలో ఆమె పీఓకేలోని కోట్లీ జిల్లా గిమ్మా గ్రామానికి చెందిన 35 ఏళ్ల షెహనాజ్ అక్తర్‌గా నిర్ధారణ అయింది. ప్రాథమిక విచారణలో భాగంగా తన తండ్రితో గొడవపడి కోపంతో ఇల్లు వదిలి వచ్చానని, ఆ క్రమంలోనే సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు ఆమె వెల్లడించింది.
అయితే ఆమె చెప్పిన కారణంపై భద్రతా బలగాలకు పూర్తిస్థాయిలో నమ్మకం కలగడం లేదు. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఆమె రాక వెనుక ఏదైనా ఉగ్రవాద కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు మహిళా విభాగాలను ఏర్పాటు చేసి దాడులకు ప్రయత్నిస్తున్నాయన్న నివేదికల నేపథ్యంలో సైన్యం ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఆమె ఉద్దేశపూర్వకంగానే దేశంలోకి చొరబడిందా లేక పొరపాటున సరిహద్దు దాటిందా అన్నది తేల్చేందుకు సైనిక అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్మీ కస్టడీలో ఉన్న షెహనాజ్‌ను త్వరలోనే తదుపరి దర్యాప్తు నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించనున్నారు. సరిహద్దుల్లో గత కొంతకాలంగా ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ, ఈ చొరబాటు ఘటనతో భద్రతా దళాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఆమె వద్ద నుంచి ఏవైనా అనుమానాస్పద వస్తువులు లేదా సమాచారం లభ్యమవుతుందా అనే అంశంపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

