Sangareddy

Sangareddy: డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన PMO అధికారి

Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని కొల్లూర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం (2BHK) ఇళ్ల సముదాయం అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి కార్యాలయ అధికారిణి మన్మిత్‌కౌర్‌ ప్రశంసించారు. పేదల కోసం ఒకేచోట ఇంత పెద్ద స్థాయిలో నాణ్యమైన ఇళ్లను నిర్మించడం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆమె కొనియాడారు.

గురువారం నాడు మన్మిత్‌కౌర్‌ సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణణ్‌తో కలిసి కొల్లూర్‌లోని 2BHK ఇళ్లను సందర్శించారు. ప్రాజెక్టు మొత్తం తిరిగి చూస్తూ నిర్మాణాలను దగ్గరగా పరిశీలించారు. 2BHK ప్రాజెక్టు నమూనాను చూసి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అధికారులు ఆమెకు మాట్లాడుతూ, కొల్లూర్‌లో మొత్తం 15,660 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఉన్నాయని, ఇప్పటికే లబ్ధిదారులు ఈ ఇళ్లలో నివాసం ఉంటున్నారని వివరించారు.

ప్రైవేట్ ప్రాజెక్టులకు దీటుగా నిర్మాణం:
నిర్మాణ రంగంలో ప్రైవేట్‌ ప్రాజెక్టులకు ఏ మాత్రం తీసిపోకుండా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2BHK ప్రాజెక్టును నిర్మించి, వాటిని పేద లబ్ధిదారులకు ఉచితంగా అందించడంపై మన్మిత్‌కౌర్‌ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆమె కొన్ని ఇళ్లలోకి వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.

ఒక లబ్ధిదారుడు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇచ్చిందని, తన భార్య పేరు మీద ఇల్లు వచ్చిందని సంతోషంగా తెలిపాడు. పేదలు తమ సొంతింట్లో ఆత్మగౌరవంతో జీవించడం చూసి మన్మిత్‌కౌర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె 2BHK ప్రాంగణంలో కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో కలిసి మొక్కలు నాటారు.

లబ్ధిదారులతో సమావేశం – కల్పించనున్న సౌకర్యాలు:
తరువాత మన్మిత్‌కౌర్‌ లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొల్లూర్‌ 2BHK ప్రాంగణంలో త్వరలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌, బ్యాంక్‌ సౌకర్యం, పోస్టాఫీస్‌, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల వంటి మౌలిక వసతులను కల్పిస్తామని కలెక్టర్‌ లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.

అనంతరం తెల్లాపూర్‌లోని మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్‌ను కూడా అధికారులు పరిశీలించారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో భాగం:
ఈ సందర్భంగా పీఎం కార్యాలయ అధికారి మన్మిత్‌కౌర్‌ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో భాగంగా పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన 2BHK ప్రాజెక్టులను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. కొల్లూర్‌ ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని ఆమె మరోసారి ప్రశంసించారు.

ఈ పర్యటనలో గృహనిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ చైతన్యకుమార్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, వైద్యాధికారి గాయత్రీదేవి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ  Chandrababu Naidu: తప్పుడు పోస్టులు పెడితే తాట తీస్తా..

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *