Shehbaz Sharif: ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, శాంతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. మే 15న పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “భారతదేశంతో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. కాశ్మీర్ సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలపై సమగ్ర చర్చలు జరపడానికి ముందుకు వస్తున్నాం” అని వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ ప్రభావం
ఈ వ్యాఖ్యలు ‘ఆపరేషన్ సిందూర్’ అనంతర కాలంలో రావడం విశేషం. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో భారత్ మే 7న విరుచుకుపడి ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై తీవ్ర బాంబు దాడులు జరిపాయి. ఈ దాడుల వలన 100కి పైగా ఉగ్రవాదులు, 50 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. కమ్రా వైమానిక స్థావరంపై జరిగిన దాడులు, పాక్‌కు తీవ్ర నష్టం కలిగించినట్లు తెలుస్తోంది.
భారీ దెబ్బతిన్న కమ్రా ఎయిర్‌బేస్
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కమ్రా ఎయిర్‌బేస్‌ను మళ్లీ సందర్శించడం ఈ నెలలో రెండోసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉప ప్రధాని ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ఎయిర్ చీఫ్ జహీర్ బాబర్ సిద్ధూ తదితరులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Jaishankar: ఆఫ్ఘనిస్తాన్‌తో మాట్లాడిన భారతదేశం.. ఈ అంశాలపై చర్చించారు
కాల్పుల విరమణ పొడిగింపు
భారత్-పాకిస్తాన్ మధ్య మే 10న కాల్పుల విరమణకు అవగాహన కుదిరింది. ఈ ఒప్పందాన్ని మే 18 వరకు పొడిగించినట్లు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ వెల్లడించారు. డైరెక్టరేట్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో జరిగిన హాట్‌లైన్ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పార్లమెంటులో తెలిపారు.
అమెరికా ఒత్తిడిని పాక్ ఖండన
అల్జజీరా న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇషాక్ దార్ – “కాల్పుల విరమణపై అమెరికా ఒత్తిడి ఏమీ లేదు. మేమే స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం ఇది. పొరుగు దేశంలాగా ప్రవర్తిస్తే ప్రాంతం అంతా నాశనమైపోయేది” అని పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో అమెరికా, సౌదీ అరేబియా, యుఎఇ వంటి దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు.
భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం
ఇప్పటికి ఇరు దేశాలు పరస్పర దాడులకు బ్రేక్ వేసినట్లే కనిపిస్తున్నా, ఈ శాంతి చర్చలు ఎటు దారితీస్తాయన్నది గమనించాల్సిన విషయం. భారత్ ఇప్పటికే స్పష్టంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు తమభాగమని పునరుద్ఘాటించగా, పాక్ ప్రధానమంత్రి మళ్లీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉంది. అయినా, తాజా పరిస్థితుల్లో దక్షిణాసియా శాంతిని కోరుకునే వారికి ఇది ఒక చిన్న ఆశాకిరణంగా నిలుస్తోంది.

