Pm post: ఒకే ఒక్క ఫోన్ సంభాషణ లీక్ అవడంతో థాయిలాండ్ రాజకీయాల్లో భూకంపం సంభవించింది. దేశపు అతి పిన్న వయస్కురాలైన ప్రధాని పటోంగ్టార్న్ షినవత్రా తన పదవి కోల్పోయారు.
థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పులో, ఆమె నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో ప్రధాని పదవి నుంచి వెంటనే తొలగించబడినట్లు ప్రకటించింది. కేవలం ఏడాది క్రితమే ప్రధాని బాధ్యతలు చేపట్టిన షినవత్రా ఇప్పుడు అనూహ్యంగా పదవీచ్యుతులయ్యారు.
ఫోన్ కాల్ లీక్
ఈ ఏడాది మేలో థాయిలాండ్–కంబోడియా సరిహద్దు వివాదం తీవ్రంగా ఉధృతమైంది. ఈ సమయంలో షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణలో ఆమె థాయ్ సైన్యాధికారిపై విమర్శలు చేయగా, ఆ రికార్డింగ్ లీక్ అవడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
సరిహద్దు ఉద్రిక్తతల మధ్య పొరుగు దేశ నేతకు అనుకూలంగా, సొంత సైన్యంపై విమర్శలు చేయడం జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని కోర్టు తేల్చింది. ఈ చర్యతో ప్రధాని పదవికి సంబంధించిన నైతిక బాధ్యతలు దెబ్బతిన్నాయని స్పష్టం చేస్తూ ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.
కొత్త ప్రధాని ఎంపిక సవాలు
షినవత్రా పదవి కోల్పోవడంతో, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఆమెకు చెందిన ఫ్యూథాయ్ పార్టీకి స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ అంత సులువుగా ఉండదని అంచనా. ఈలోగా ఉప ప్రధాని ఫుమ్తామ్ వెచైచాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ప్రధాని రేసులో ఎవరు?
ప్రస్తుతానికి ఫ్యూథాయ్ పార్టీకే చెందిన 77 ఏళ్ల చైకాసెం నితిసిరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే మాజీ ప్రధాని, సైనిక నేత ప్రయుత్ చాన్-ఓచా కూడా రేసులో ఉన్నారని సమాచారం.
ఏడాది క్రితం కూడా నాటి ప్రధానిని రాజ్యాంగ న్యాయస్థానం తొలగించగా, అనూహ్యంగా పదవి చేపట్టిన షినవత్రా, ఇప్పుడు అదే విధంగా పదవీచ్యుతుల కావడం థాయిలాండ్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


