PM Narendra Modi

PM Narendra Modi: 22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాం

PM Narendra Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను ఘనంగా కొనియాడారు. పహల్గాం దాడి తర్వాత కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ చేపట్టిన ఈ దాడి 22 నిమిషాల్లోనే విజయవంతమైందని ఆయన తెలిపారు.

22 నిమిషాల్లో పాక్ ఉగ్రస్థావరాలు ధ్వంసం.. మోడీ

ప్రధానమంత్రి మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ భారత సైనిక శక్తికి నిదర్శనం. కేవలం 22 నిమిషాల్లోనే పాక్‌లోని ఉగ్ర సూత్రధారుల స్థావరాలు ధ్వంసమయ్యాయి. 100% టార్గెట్లు సక్సెస్ అయ్యాయి” అని పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో ఈ ఆపరేషన్ నిర్వహించడం గర్వకారణం” అని మోడీ స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రాంతాల్లో కూడా పరిస్థితులు మారాయని, “రెడ్ కారిడార్లు ఇప్పుడు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయి” అని తెలిపారు.

పహల్గాం దాడి – జాతీయ ఐక్యతకు పిలుపు

పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశానికి పెద్ద షాక్ ఇచ్చిందని, ఆ దాడి తర్వాత దేశం అంతా ఐక్యంగా నిలిచిందని మోడీ గుర్తు చేశారు. పార్లమెంట్‌లో కూడా అదే ఐక్యతను ప్రతిబింబించాలని ప్రతిపక్ష పార్టీలను ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Mithun Reddy Arrest: ఒక్క అరెస్ట్‌.. వంద ప్రశ్నలకు సమాధానం

పాక్‌పై ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రచారం

పాక్ ఉగ్రవాద ముఖం బయటపెట్టడంలో భారత పార్లమెంట్ ఎంపీల బృందం చేసిన కృషిని మోడీ ప్రశంసించారు.“ప్రపంచ దేశాలకు పాక్ అసలు రూపం చూపించాం. పలు దేశాల్లో మన ఎంపీలు పర్యటించి పాక్ ఉగ్రవాదాన్ని బహిర్గతం చేశారు” అని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాధాన్యత పెరిగిందని, “ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానంలో నిలవడం గర్వకారణం” అన్నారు.

వర్షాకాల సమావేశాలు – వేడెక్కే చర్చలు

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఈ సమావేశాల్లో పహల్గాం దాడి, అంతర్గత భద్రతా లోపాలు, బీహార్ రాజకీయ పరిణామాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి, “పహల్గాం దాడి జరిగేలా అంతర్గత భద్రత ఎందుకు విఫలమైంది?” అనే అంశంపై చర్చ కోరుతూ నోటీసు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నదానిపై కూడా ప్రతిపక్షం ప్రశ్నించనుంది.

వ్యవసాయం, అంతరిక్షం – మోడీ మరో సందేశం

వర్షాకాలం ప్రారంభం వ్యవసాయానికి మేలు చేస్తుందని, రైతుల జీవనోపాధి వర్షాలపై ఆధారపడి ఉందని మోడీ తెలిపారు. అంతరిక్ష రంగంలో విజయాలను ప్రస్తావిస్తూ, “యాక్సియం-4 మిషన్‌తో అంతరిక్షంలో మువ్వన్నెల జెండా ఎగరడం ప్రతి భారతీయుడికి గర్వకారణం” అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *