Pak Terrorism vs India

Pak Terrorism vs India: కొంపకు నిప్పు ఆర్పుకోక భారత్‌పై పాక్ కుట్రలు

Pak Terrorism vs India: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్‌ను కుదిపేసింది. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఈ ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత్‌ ఆధారాలతో సహా ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో సహా ప్రపంచ దేశాలు భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలకైనా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చాయి. భారత్ కూడా ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. పాకిస్తాన్‌పై ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు చేపట్టింది.

సింధూ జలాల ఒప్పందం నుంచి పాక్ జాతీయులను భారత్ నుంచి తరిమేయడం, వీసాలు నిలిపివేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. అయినా, ముష్కర దేశం పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. దీంతో భారత్ ఇప్పుడు సైనిక చర్యలకు సన్నద్ధమవుతోంది. పాక్ భూభాగంలో దాక్కున్న ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసేందుకు సర్జికల్ స్ట్రైక్‌లతో పాటు అంతకు మించిన దాడులకు ప్లాన్ చేస్తోంది. పాక్‌పై చర్యలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో.. ప్రపంచదేశాలకు అర్థమయ్యేలా మన ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ద్వారా అర్థమౌతోంది. భారత్‌ ప్రతీకారం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రపంచం తెలుసుకోబోతుందంటూ ప్రధాని చెప్పారంటేనే.. అర్థం చేసుకోవచ్చు.. పాక్‌కి ఇక తన చేతిలో ఉన్న చిప్ప కూడా మిగలదని.

భారత్‌ చేపట్టబోయే ఆపరేషన్ల వివరాలు.. గతంలో మాదిరే.. ఆపరేషన్‌ జరిగిన తర్వాతే వెల్లడవుతాయి. ఇకపై ఏ క్షణం ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో, దాయాది దేశం, దాని ఆర్మీ దళాలు ఊపిరి బిగబట్టి బతకాల్సిందే. పాకిస్తాన్ ఆర్థికంగా కుంగిపోవడానికి కారణం ఉగ్రవాదమే. ఆ దేశం చిప్ప చేతిలో పట్టుకుని ప్రపంచ దేశాలను అడుక్కుతినేలా చేసింది కూడా ఉగ్రవాదమే. అయినా పాక్‌ బుద్ది మాత్రం కించిత్తైనా మారింది లేదు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్స్‌, మరోవైపు బలూచిస్తాన్ రెబల్స్‌.. ముప్పేట దాడులతో పాక్‌ అల్లకల్లోలంగా మారింది. ఒకప్పుడు తాలిబన్‌కు సహకరించిన పాకిస్తాన్, ఇప్పుడు వారితోనే యుద్ధం చేస్తోంది. బలూచిస్తాన్‌లో స్వతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. ఇటీవల రైలును పేల్చిన ఘటన దీనికి నిదర్శనం. తన దేశంలో అస్థిరతను నియంత్రించలేక, భారత్‌పై కుట్రలకు పాల్పడుతోంది పాకిస్తాన్‌.

Also Read: Hyderabad: వేసవిలో హైదరాబాద్ నుండి AC రైలు టిక్కెట్లకు అధిక డిమాండ్

Pak Terrorism vs India: దేశంలో కొందరు పహల్గాం పర్యాటకులపై ముష్కరుల దాడిలో మత కోణం లేదని, బీజేపీ రాజకీయం చేస్తోందని వాదిస్తున్నారు. కానీ, దాడి నుండి తప్పించుకున్న బాధితులు మాత్రం ముస్లింలను గుర్తించి వదిలేశారనీ, ముస్లిమేతరులను మాత్రమే వేటాడి చంపారని చెబుతున్నారు. ఇది మత కోణాన్ని స్పష్టం చేస్తున్నప్పటికీ.. దీనిని దేశంపై జరిగిన దాడిలానే భావించాలని మేధావులు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులు జరిపిన ప్రతి దాడిలోనూ భారత్‌లో హిందూ, ముస్లిం సమాజాల మధ్య విద్వేషాలను, ఘర్షణలను రేకెత్తించడమే వారి హిడెన్‌ అజెండా అని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం దేశద్రోహంతో సమానం అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచమంతా భారత్‌కు మద్దతిస్తుంటే, దేశంలో మాత్రం భిన్న స్వరాలు వినిపించడం బాధాకరమని.. దేశం అంతా ఒక్కటిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని మేధావి వర్గాలు పిలుపునిస్తున్నాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *