PM Modi: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో బుధవారం (నవంబర్ 19, 2025) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సత్యసాయి శత జయంతి వేదికపై ప్రధాని
ప్రధాని మోదీ ఈ నెల 19న ఉదయం 9:50 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లి, 10:00 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో ఉన్న బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం, 10:20 గంటలకు హిల్ వ్యూ స్టేడియంలో జరిగే సత్యసాయి శత జయంతోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. ప్రధాని సభ కోసం హిల్ వ్యూ స్టేడియంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు, ఇతర సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Also Read: Hyderabad: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వం
భారీ భద్రత, ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా త్రివిధ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. సత్యసాయి విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయం, హిల్‌వ్యూ స్టేడియం వరకు రహదారి అంతటా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మొత్తం పర్యటన ఏర్పాట్లు, రవాణా నిర్వహణ, భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కీలక ఐఏఎస్ (IAS) అధికారులను నియమించింది. వీరితో పాటు, జిల్లా స్థాయిలోని జేసీలు (జాయింట్ కలెక్టర్లు), 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు కూడా వివిధ విభాగాల బాధ్యతలను అప్పగించడం జరిగింది.

