Ayodhya: దేశ చరిత్రలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతుంది. అయోధ్యలో నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరం ప్రధాన శిఖరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాషాయ జెండాను ఎగురవేయనున్నారు. నవంబర్ 25న ఈ చారిత్రక ఘట్టం జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆలయ నిర్మాణం పూర్తిగా పూర్తయినట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అధికారికంగా ప్రకటించినట్లు అవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. 161 అడుగుల ఎత్తు ఉన్న ప్రధాన శిఖరంపై 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు గల ప్రత్యేకమైన కాషాయ జెండాను ఎగురవేస్తారు. ఈ జెండాపై సూర్యుడి చిహ్నం ముద్రించబడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Puthur Zoo Deer Deaths: దారుణం.. వీధి కుక్కల దాడిలో 10 జింకలు మృతి
దీనిని అత్యంత కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా పారాచూట్ ఫ్యాబ్రిక్, పట్టు దారంతో తయారు చేస్తున్నారు. నవంబర్ 25న ప్రధాని మోదీ దాదాపు మూడు గంటల పాటు అయోధ్యలో పర్యటించనున్నారు. ఆయన మొదట బాల రాముడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 12.30 గంటల మధ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారని ట్రస్ట్ వెల్లడించింది.
ఈ కార్యక్రమానికి 6,000 నుంచి 8,000 మంది అతిథులను ఆహ్వానించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరమంతా 30కి పైగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, జెండా ఆవిష్కరణ రోజున సాధారణ భక్తులకు దర్శనం ఉండదని అధికారులు తెలిపారు. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ, ఈ వేడుక కేవలం మతపరమైన మైలురాయి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఇది సంకేతమని అన్నారు.

