PM Modi

PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌.. ఎజెండా అదేనా?

PM Modi: పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సంక్షోభం వల్ల దేశంపై పడే ప్రభావాన్ని చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు.

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు (Oil), గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌కు అవసరమైన ఇంధనంలో ఎక్కువ భాగం అక్కడి నుంచే వస్తుంది కాబట్టి, మున్ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చూడటం.. అలాగే నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ఉండటంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో అక్రమ నిల్వలు (Hoarding), బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరనున్నారు.

అంతేకాకుండా, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోట్లాది మంది భారతీయుల భద్రతపై కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వారి క్షేమ సమాచారంతో పాటు, అవసరమైతే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతైనా అవసరమని ప్రధాని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునివ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *