Narendra Modi: భారతదేశం ‘వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నేటి (డిసెంబర్ 1) నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు ఫలవంతంగా, సానుకూలంగా సాగాలని ఆకాంక్షిస్తూ, దేశాభివృద్ధి కోసం సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
దేశ ప్రగతిపై దృష్టి పెట్టండి: ఎంపీలకు ప్రధాని సూచన
ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం అత్యవసరం. చట్ట సభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి. దేశ ప్రగతి కోసం పార్లమెంట్‌లో మంచి చర్చలు కొనసాగాలి అని ప్రధాని మోదీ కోరారు.
నూతన ఎంపీలకు మార్గదర్శనం: కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్ఫూర్తినిచ్చే విధంగా సీనియర్ సభ్యుల ప్రవర్తన ఉండాలని ఆయన సూచించారు. చట్ట సభల్లో డ్రామాలు వద్దు… మంచి చర్చలు జరగాలి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలవద్దని” విపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు.
పరాజయాన్ని కూడా ఒప్పుకునే మనస్సు విపక్షానికి లేదని పరోక్షంగా పేర్కొన్న మోదీ, తాము మాత్రం విపక్షాలను కలుపుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి మాత్రమే తమ ప్రధాన లక్ష్యమని, దీని కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని అందరినీ కోరుతున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Ayyappa Deeksha: అయ్యప్ప దీక్షలో ‘ఏకభుక్తం’: అర్థం, ఆంతర్యం ఏమిటి?
ఎన్నికలు, సంస్కరణలు ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికలలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడాన్ని, మహిళా ఓటింగ్ శాతం పెరగడాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే, జీఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
కేంద్రం బిల్లులు: విపక్షాల డిమాండ్లు
నేటి నుంచి మొత్తం 15 రోజుల పాటు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో ముఖ్యంగా కాలం చెల్లిన 120 చట్టాలను రద్దు చేసే బిల్లు కీలకమైనది.
మరోవైపు, పార్లమెంట్‌లో అనేక అంశాలపై చర్చ జరగాలని విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. ప్రధానంగా వారు చర్చించాలని కోరుతున్న అంశాలు:
-
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ
-
ఢిల్లీ పేలుడు ఘటన, దేశ భద్రత
-
రైతుల సమస్యలు
-
ఢిల్లీ వాయు కాలుష్యం
అయితే, సభా కార్యకలాపాలు సజావుగా, సద్విమర్శలకు తావిచ్చేలా సాగుతాయా, లేక విపక్షాల నినాదాలతో స్తంభించిపోతాయా అనేది వేచి చూడాలి. దేశ ప్రగతిని దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

