PM Modi

PM Modi: హస్తం పార్టీపై ప్రధాని నిప్పులు.. ఆరాటం తప్ప పోరాటం లేదంటూ ఎద్దేవా

PM Modi: అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిల్చార్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని అడ్డం పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని మోడీ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, భారతీయులపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

దేశాభివృద్ధిని అడ్డుకోవాలని చూసే కొన్ని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ ఒక “కీలుబొమ్మ”లా మారిందని ప్రధాని ఆరోపించారు. ఇలాంటి విదేశీ శక్తుల ప్రోద్బలంతోనే కాంగ్రెస్ నాయకులు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండాల్సింది పోయి, కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంటే అది చూడలేక కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, అందుకే అస్సాం వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికే లేకుండా పోయిందని మోడీ ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతున్నారని, త్వరలోనే ఆ పార్టీ వందేళ్ల పరాజయాల రికార్డును మూటగట్టుకోబోతుందని సెటైర్లు వేశారు. ఏఐ (AI) సమ్మిట్ వంటి చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న నిరసనలను ప్రస్తావిస్తూ.. చేసేదేమీ లేక, నిరాశతో కాంగ్రెస్ నేతలు బట్టలు చింపుకోవడం తప్ప ప్రజల కోసం చేసే పనులేవీ వారి వద్ద లేవని ప్రధాని ఘాటుగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *