PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నిర్వహించిన 129వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. 2025వ సంవత్సరానికి ముగింపు పలుకుతూ, నూతన సంకల్పాలతో 2026లోకి అడుగుపెడుతున్న తరుణంలో భారత్ ఈ ఏడాది సాధించిన అసాధారణ విజయాలను ఆయన నెమరువేసుకున్నారు. ముఖ్యంగా దేశ భద్రత విషయంలో నేటి భారతం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా నిరూపితమైందని ఆయన గర్వంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక సైనిక విజయం మాత్రమే కాదని, మారుతున్న భారతావని యొక్క ఆత్మవిశ్వాసానికి, శత్రువుల గుండెల్లో నిదురపోయే తెగింపునకు నిదర్శనమని ప్రధాని అభివర్ణించారు.
అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన వ్యోమగామి శుభాంశు శుక్లా కృషిని ప్రధాని ప్రత్యేకంగా కొనియాడారు. సాంకేతికత, శాస్త్రీయ ఆవిష్కరణలలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందని, యువత ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తరలిరావడం మన సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టిందని గుర్తుచేశారు. గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య పెరగడం పర్యావరణ పరిరక్షణలో మన విజయం అని, అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నేడు అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు
యువతే దేశానికి వెన్నెముక అని విశ్వసించే ప్రధాని, జనవరి 12న స్వామి వివేకానంద జయంతి (నేషనల్ యూత్ డే) సందర్భంగా ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్’ రెండో సదస్సును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 15 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత తమ వినూత్న ఆలోచనలను నేరుగా పంచుకోవడానికి ఈ వేదిక ఒక గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రతి భారతీయుడు తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించవచ్చని సూచించారు. 2026వ సంవత్సరంలోకి సరికొత్త లక్ష్యాలతో, దృఢమైన ఆశయాలతో అడుగుపెడదామని దేశ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
