Narendra Modi: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు ఆర్మీపై ఘోర దాడి చేశారు. అయితే, ఈ దాడికి భారత ప్రభుత్వం 22 నిమిషాల్లోనే ధీటైన ప్రతీకారం తీసుకుంది. ఈ ప్రతిస్పందన పేరు ఆపరేషన్ సింధూర్. ఇది భారత త్రివిధ దళాల సమన్వయంతో జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఇప్పుడు భారత్ ఎలా మారిందో ప్రపంచం చూస్తోంది. ఇంతకముందు ఉగ్రవాదులు దాడులు చేసి పారిపోయేవారు. ఇప్పుడు దాడి చేయాలన్నా వారికే భయం వేసే పరిస్థితి ఏర్పడింది” అన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన భారత డ్రోన్లు పాక్ మిస్సైల్స్‌ను ధ్వంసం చేశాయని చెప్పారు.
మోదీ వ్యాఖ్యల ప్రకారం, పాక్ ఎయిర్ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు ఈ దెబ్బ స్పష్టమైన సంకేతమని అన్నారు. “భారత శక్తి ఏమిటో ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం” అని స్పష్టం చేశారు.
విపక్షాల విమర్శలపై కూడా మోదీ తీవ్రంగా స్పందించారు. “సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. కానీ కాంగ్రెస్ మాత్రం సైన్యంపై విమర్శలు చేస్తోంది. తప్పుడు ఆరోపణలతో హెడ్‌లైన్‌లోకి రావాలని చూస్తోంది. ఇది సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ మద్దతు, అంతర్జాతీయ గుర్తింపు
ప్రపంచంలోని 193 దేశాల్లో 190 దేశాలు భారత్ వైపు నిలిచాయని, కేవలం మూడు దేశాలే పాక్‌కు మద్దతుగా నిలిచాయని ప్రధాని మోదీ చెప్పారు. “అణుబాంబు బెదిరింపులకు లొంగే దేశం కాదు మన భారత్. అవసరమైతే ధైర్యంగా ముందుకు వెళ్లగల శక్తి మనకు ఉంది” అని చెప్పారు.
పాక్ పై తీవ్ర దాడులకు ముందు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారని, కానీ తాను మిలటరీ అధికారులతో ఉన్నందున స్పందించలేకపోయానని వివరించారు. ఆ తర్వాత మాట్లాడుతూ, “పాక్ మరోసారి ప్రయత్నిస్తే, వారికి దీని కంటే కూడా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.

