PM Modi

PM Modi: ఆపరేషన్ సిందూర్‌’ విజయం.. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ

PM Modi: దేశ ప్రజలందరికీ వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక లేఖను విడుదల చేశారు. శక్తి, ఉత్సాహంతో నిండిన ఈ పండుగ వేళ, భారతదేశం సాధించిన చారిత్రక విజయాలు, అభివృద్ధి లక్ష్యాలను ఆయన ఈ లేఖలో ముఖ్యంగా ప్రస్తావించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత జరుపుకుంటున్న రెండో దీపావళి ఇది అని ఆయన గుర్తు చేశారు.

నక్సలిజం నిర్మూలన: ఆపరేషన్ సిందూర్‌ విజయం
శ్రీరాముడు ధర్మాన్ని పాటించాలని, అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని బోధించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బోధనలకు నిదర్శనంగా ఈ ఏడాది మే నెలలో విజయవంతంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్‌’ను ప్రస్తావించారు. ఈ ఆపరేషన్‌లో భారతదేశం ధర్మాన్ని నిలబెట్టి, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందని ఆయన వివరించారు.

ఈ సంవత్సరం దీపావళి ప్రత్యేకంగా ముఖ్యమైనదని ప్రధాని తెలిపారు. ఎందుకంటే, ఒకప్పుడు నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం సమూలంగా ఉన్న మారుమూల జిల్లాల్లో కూడా తొలిసారిగా దీపాలు వెలుగుతున్నాయని చెప్పారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టి, దేశ రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, మాజీ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధికి దోహదపడుతున్నారని, ఇది దేశానికి దక్కిన అతిపెద్ద విజయం అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Also Read: EPS Pension Scheme: PF, EPS డబ్బు విత్‌డ్రా రూల్స్‌లో మార్పులు..

ఆర్థిక సంస్కరణలు, ప్రపంచ స్థిరత్వం
ప్రపంచ దేశాలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ఈ సమయంలో, భారతదేశం స్థిరత్వం, సున్నితత్వానికి చిహ్నంగా ఉద్భవించిందని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తదుపరి తరం సంస్కరణల్లో భాగంగా, నవరాత్రి మొదటి రోజున జీఎస్టీ ధరలను తగ్గించడం జరిగింది. ఈ జీఎస్టీ పొదుపు ద్వారా దేశ ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని, ఇది ప్రజల జీవితాన్ని సులభతరం చేసి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని ప్రధాని తెలిపారు.

ప్రతిజ్ఞ: వికసిత్ భారత్‌కు మన కర్తవ్యం
అభివృద్ధి చెందిన (వికసిత్) భారత్, స్వావలంబన కలిగిన భారతదేశం వైపు ప్రయాణంలో ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి, ‘ఇది స్వదేశీ’ అని గర్వంగా చెప్పాలి. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని ప్రోత్సహించాలి అన్ని భాషల పట్ల గౌరవం పెంచుకోవాలి. పరిశుభ్రత పాటించాలి, తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి.

“ఒక దీపం మరొక దీపం వెలిగించినప్పుడు, దాని కాంతి తగ్గదు, పెరుగుతుంది” అని దీపావళి మనకు బోధిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో, సమాజంలో సామరస్యం, సహకారం, సానుకూలత దీపాలను వెలిగించాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ లేఖను ముగించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *