Bihar Elections: బిహార్‌లో NDA కూటమి విజయం తథ్యమని.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. నవంబర్ 14న బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఆ రోజు రాష్ట్ర ప్రజలు మరోసారి దీపావళి జరుపుకుంటారని పేర్కొన్నారు. నమో యాప్ ద్వారా బిహార్ లోని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ NDA, యునైటెడ్ బిహార్ మళ్లీ సుపరిపాలన ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీస్తుందనే నినాదాన్ని ఇచ్చారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి బూత్ ను బలోపేతం చేయాల్సిన అవసరంఉందన్నారు. ప్రతి కార్యకర్త ఒక మోదీనేనని చెప్పిన ఆయన ప్రభుత్వ పథకాలపై ఓటర్లకు తన తరఫున హామీ ఇవ్వాలన్నారు. కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ఎన్నికల జరిగే వరకు ప్రతి ఇంటిని పదిసార్లు సందర్శించి ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని చెప్పారు. ఇదే సమయంలో విపక్షాలపై ప్రధాని విమర్శలు గుప్పించారు.బిహార్ లో జంగిల్ రాజ్ పాలన సమయంలో ఏం జరిగిందో ఇప్పడు యువత చూడలేదని ఆ సమయంలో నక్సలిజం బాగా పెరిగందన్నారు. వారికి దాని గురించి అవగాహన కల్పించాలని సూచించారు.