PM Modi: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన (జంగిల్ రాజ్) నుండి ప్రజలకు విముక్తి లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ పర్యటనలో భాగంగా ఆయన తాహేర్‌పూర్ వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ నిలిచిపోయింది. దీనితో కోల్‌కతా విమానాశ్రయం నుంచే ప్రధాని వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బంకిం చంద్ర ఛటర్జీకి నివాళులర్పించిన ఆయన, బ్రిటిష్ కాలంలో దేశాన్ని ఏకం చేసిన ‘వందేమాతరం’ మంత్రాన్ని ఇప్పుడు దేశ నిర్మాణానికి పునాదిగా మార్చాలని పిలుపునిచ్చారు.
Also Read: Cm revanth: 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం అసహనం
రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని మోదీ హితవు పలికారు. బెంగాల్ అభివృద్ధికి కేంద్రం వద్ద నిధుల కొరత లేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లే అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో చొరబాటుదారులకు రక్షణ లభిస్తోందని పేర్కొంటూ, జంగిల్ రాజ్‌ను అంతం చేసేందుకు ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా రూ. 3,200 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. నదియా జిల్లాలోని బర్జగులి-కృష్ణానగర్ మధ్య 66.7 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారిని జాతికి అంకితం చేయడంతో పాటు, బరాసత్-బర్జగులి సెక్షన్ పనులకు శంకుస్థాపన చేశారు. గంగానది బీహార్ మీదుగా బెంగాల్‌కు ప్రవహిస్తూ మార్గం చూపినట్లుగానే, బెంగాల్ ప్రజలు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
