కేంద్ర బడ్జెట్ 2026ను చారిత్రాత్మకమైనదిగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించినదిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆదివారం బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి రోడ్‌మ్యాప్ అని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా ఉండటంతోనే తాము సంతృప్తి చెందడం లేదని, అతి త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ బడ్జెట్‌ను యువ శక్తి బడ్జెట్ గా ప్రధాని అభివర్ణించారు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాలకు ఈ బడ్జెట్ కొత్త ఊపిరి పోస్తుందన్నారు. సెమీకండక్టర్ మిషన్ 2.0, బయో-ఫార్మా శక్తి మిషన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో తీసుకువచ్చిన కొత్త పథకాలు దేశీయంగా ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఎంఎస్ఎంఈ (MSME) రంగం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టడం వల్ల చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె అరుదైన రికార్డు సృష్టించారని, ఈ బడ్జెట్‌లో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత లభించిందని కొనియాడారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, ఈ బడ్జెట్ వారి ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
ఈసారి బడ్జెట్‌లో క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ (AVGC) రంగాల్లో 2030 నాటికి 20 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం 15,000 స్కూళ్లు, 500 కాలేజీల్లో ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని గుర్తుచేశారు. ఇది డిజిటల్ రంగంలో భారతీయ యువతకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని ఆయన తెలిపారు.

