Trump

Trump: రష్యా చమురు కొనుగోలు నిలిపివేతకు మోదీ హామీ: ట్రంప్ సంచలన ప్రకటన

Trump: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేస్తామని తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం రష్యాను ఆర్థికంగా ఒంటరిగా (ఏకాకిగా) చేయడంలో ‘పెద్ద ముందడుగు’ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్ హౌస్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఇకపై రష్యా చమురు కొనుగోలు చేయరు”
“భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం నాకు నచ్చలేదు. కానీ ఈ రోజు మోదీ నాకు హామీ ఇచ్చారు, ఇకపై కొనుగోలు చేయబోమని చెప్పారు,” అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఇది తక్షణమే జరిగే ప్రక్రియ కాదని, దీనికి కొంత సమయం పడుతుందని మోదీ చెప్పినట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పుడు చైనాను కూడా అదే విధంగా ఒప్పించే ప్రయత్నం చేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో, పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ, భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద కస్టమర్‌లలో ఒకటిగా మారింది. ఈ కొనుగోళ్ల ద్వారా రష్యాకు నిధులు అందుతున్నాయని, వాటితోనే పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని తాము భావిస్తున్నామని ట్రంప్ అన్నారు.

Also Read: Bihar Elections: బిహార్‌లో NDA కూటమి విజయం తథ్యం.. మోదీ ధీమా!

యుద్ధ విరమణకు ఇదే మార్గం
రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తే, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం సులభమవుతుందని ట్రంప్ నొక్కి చెప్పారు. యుద్ధం ఆగిపోయిన తర్వాతే భారత్ సహా ఇతర దేశాలు రష్యాతో మళ్లీ వ్యాపారం మొద లుపెట్టవచ్చని అన్నారు. అధ్యక్షుడు పుతిన్ వెంటనే ఉక్రెయినియన్లు, రష్యన్ల మరణాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. జెలెన్‌స్కీ, పుతిన్‌ల మధ్య ఉన్న ద్వేషం యుద్ధ విరమణకు అడ్డంకిగా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

భారత్ అమెరికాకు విశ్వసనీయ భాగస్వామి
భారత్‌తో అమెరికా సంబంధాలపై ట్రంప్ మాట్లాడుతూ, “మోదీ నాకు గొప్ప మిత్రుడు” అని పేర్కొన్నారు. రష్యా చమురు విషయంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ, యూఎస్‌కు ఇండియా ఎప్పటికీ సన్నిహిత భాగస్వామే అని ట్రంప్ స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా మోదీ భారత ప్రధానిగా కొనసాగుతున్న తీరును కూడా ఆయన ప్రశంసించారు.

ఈ అంశంపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజమైతే, భారత్ తన చమురు వ్యూహంలో భారీ మార్పులు తీసుకురానున్నట్లు భావించవచ్చు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *