PM Modi: దేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 12వ సారి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. జెండా ఆవిష్కరణ అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మోదీ, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో ఎర్రకోటపై ఎగిరిన జాతీయ జెండాపై ఎంఐ-17 హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ప్రధాని మోదీ తన ప్రసంగంలో దేశం సాధించిన ప్రగతిని, భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. ఈ ప్రసంగంలో ఆయన వివిధ అంశాలను ప్రస్తావించారు.
అమరవీరులకు నివాళులు:
స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వంటి వారి త్యాగాలను స్మరించుకున్నారు. “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంతో ప్రతి ఇల్లు మువ్వన్నెల జెండాను ఎగురవేయడం గొప్ప సమైక్య భావనను తెలియజేస్తుందని అన్నార.
ఉగ్రవాదంపై కఠిన వైఖరి – ఆపరేషన్ సింధూర్:
ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రధాని స్పష్టం చేశారు. పహల్గామ్‌లో మతం పేరుతో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, ఆ దుర్మార్గానికి ప్రతిస్పందనగా “ఆపరేషన్ సింధూర్”ను విజయవంతంగా నిర్వహించిన సైనికులను ప్రశంసించారు. “శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టాం” అని చెబుతూ, అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని స్పష్టం చేశారు. అలాగే సింధూ జలాల ఒప్పందంపై మాట్లాడుతూ, “రక్తం, నీరు కలిసి ప్రవహించవు” అని పాకిస్తాన్‌కు గట్టి సందేశం పంపారు.
Also Read: Murmu: భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సిందూర్ చారిత్రాత్మక ఘట్టం
స్వయం సమృద్ధి భారతం కోసం పిలుపు:
మోదీ యువతను ప్రోత్సహిస్తూ, “యంగ్ ఇండియా” ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘మేడిన్ ఇండియా’ ఫైటర్ జెట్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ వాహనాల పరికరాలను మనమే తయారు చేసుకోవాలని సూచించారు. దేశ సంపద బయటి దేశాలకు వెళ్ళకుండా చూసుకోవాలని, ‘స్వదేశీ మంత్రం’తో ముందుకు సాగాలని కోరారు. యూపీఐ వంటి విజయాలు భారతదేశ సృజనాత్మకతకు నిదర్శనమని అన్నారు.
యువతకు కొత్త పథకం:
దేశ యువత కోసం రూ.1 లక్ష కోట్లతో “పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన” అనే కొత్త పథకాన్ని పంద్రాగస్టు సందర్భంగా ప్రారంభించారు. దీని కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు రూ.15 వేల లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు.
డబుల్ దీపావళి & జీఎస్టీ సంస్కరణలు:
ప్రధాని మోదీ ఈ సంవత్సరం “డబుల్ దీపావళి” ఉంటుందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు మేలు చేసేలా జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రోజువారీ వస్తువుల ధరలను అందుబాటులోకి తెస్తామని, ఈ దీపావళికి ఈ సంస్కరణలను ప్రజలకు బహుమతిగా ఇస్తామని అన్నారు.