Pm modi: పంజాబ్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత సైనిక దళాల సేవలను ప్రాశంసిస్తూ, దేశ భద్రత కోసం వారు చేసే త్యాగాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి:
ప్రధాని మోడీ వాయుసేన దళాలను ఉద్దేశిస్తూ, “మీరు చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్‌కు భారత వాయుసేన తన సత్తా చూపింది. వీరుల పట్ల గౌరవంతో జీవితం ధన్యమవుతుంది” అన్నారు. అణు బాంబులతో భారత్‌ను బెదిరించే ప్రయత్నాలను భారత్ ధైర్యంగా ఎదుర్కొందని తెలిపారు. “భారత్ మాతాకీ జై” నినాదం ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తోందని, అదే నినాదం శత్రువులకు నిద్ర లేకుండా చేస్తోందని మోడీ పేర్కొన్నారు.
భారత వాయుసేన ప్రతిభకు ప్రపంచం ఆశ్చర్యపోతుందని, భవిష్యత్ తరాలకు వారు ప్రేరణగా నిలుస్తారని మోడీ అభిప్రాయపడ్డారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సెల్యూట్ చెబుతూ, “ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నారు. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ ఒక సాధారణ సైనిక విన్యాసం కాదు; ఇది భారతదేశ నైతికతకు, నియమానికి, నిర్ణయానికి నిదర్శనం” అని ప్రధాని స్పష్టం చేశారు.
ఇక దేశానికి గురుగోవింద్ సింగ్ వంటి మహానుభావులు ఉన్నారని, అవసరమైనప్పుడు ధర్మరక్షణ కోసం ఆయుధాలు ఉపయోగించడం భారత సంప్రదాయమేనని ప్రధాని మోదీ గుర్తు చేశారు. “మన మహిళల సిందూరాన్ని అపహరించినవారి ఇళ్లలోకి వెళ్లి దాడి చేశాం. వారు వెనుకనుంచి దాడి చేస్తే, మన సైనికులు ఎదురుగా నిలబడి పోరాడారు” అని తెలిపారు.
ఆఖరిగా, “భారత ఆర్మీ, నేవీ, వాయుసేనలు పాకిస్తాన్ సైన్యాన్ని గడగడలాడించాయి. మన డ్రోన్లు, మిస్సైల్స్ వారికి నిద్రపట్టనివ్వలేదు. మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ గురించి రాసిన కవిత మన ఆయుధాల సామర్థ్యాన్ని గుర్తుచేస్తుంది. భారత స్వాభిమానాన్ని మేము కొత్త శిఖరాలకు చేర్చాం” అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

