Cricket: భారత జట్టు తరఫున ఎంతో కాలం పాటు ప్రాతినిధ్యం వహించిన లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా (36) తన క్రికెట్ జీవితానికి ముగింపు పలికాడు. అంతర్జాతీయ మరియు దేశవాళీ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
“ఇప్పటికే రెండు దశాబ్దాల పాటు ఈ అద్భుతమైన ఆటను ఆడిన తరువాత, క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. భారత జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉండటం — ఇవన్నీ నా జీవితంలోని మరిచిపోలేని క్షణాలు. ఈ ప్రయాణం దేవుడి ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. ఈ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి” అని చావ్లా తన పోస్టులో పేర్కొన్నాడు.
2006 నుంచి 2012 మధ్యకాలంలో చావ్లా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, మొత్తంగా 43 వికెట్లు సాధించాడు.
ఐపీఎల్‌లోనూ పీయూష్ చావ్లా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 192 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు అతడు ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2022 నుంచి 2024 వరకూ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగాడు.
ఐపీఎల్ తన కెరీర్‌లో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని పేర్కొంటూ, తాను ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని, తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు తెలిపారు.
తన ప్రగతికి దోహదపడిన కోచ్‌లు కే.కే. గౌతమ్, దివంగత పంకజ్ సారస్వత్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, జీవితయాత్రలో ఎల్లప్పుడూ అండగా నిలిచిన తన కుటుంబానికి ధన్యవాదాలు చెప్పాడు. ముఖ్యంగా, తనపై అపారమైన నమ్మకంతో మార్గనిర్దేశం చేసిన తన దివంగత తండ్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. “ఆయన లేకపోతే ఈ ప్రయాణం అసాధ్యమే” అంటూ భావోద్వేగంగా పేర్కొన్నాడు.

