Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు బీజేపీ నేతలు సిట్ ఎదుట హాజరు

Phone tapping: రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక దశ ప్రారంభం కానుంది. బీజేపీ కీలక నేతలు — ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు — రేపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో వీరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

సిట్ అధికారుల విచారణలో 2023 నవంబర్ 15 నుండి ఈ ముగ్గురు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అంతేకాదు, నేతలే కాదు… వారి కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు, మద్దతుదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బీజేపీ నేతలు ఏ రాజకీయ కార్యాచరణ చేపడుతున్నారో ముందుగానే తెలుసుకోవడానికి ట్యాపింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ సమాచారాన్ని అప్పటి ప్రభుత్వం తరఫున కీలక అధికారిగా పనిచేసిన ప్రభాకర్ రావు తరలించి, తన సన్నిహితుడైన భుజంగరావుకు అందజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

భుజంగరావు ఆ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు పంచినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రత్యర్థి నేతల రాజకీయ వ్యూహాలను ముందుగానే అర్థం చేసుకుని ప్రత్యుత్తర చర్యలు చేపట్టారని భావిస్తున్నారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులను విచారించిన సిట్, ఇప్పుడు రాజకీయ నేతల నుంచి కూడా వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. రేపు విచారణలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Heroines: పారితోషికంలో వీరే టాప్ హీరోయిన్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *