Hyderabad: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి టి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. అనంతరం, ఆయనకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభాకర్ రావు మూడు రోజుల్లోగా భారతదేశానికి తిరిగి రావాలని, ఆయన భారత్ చేరిన తర్వాత దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఆయన తిరిగి రావడానికి అనుమతించేలా పాస్‌పోర్ట్‌ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణ జరుగే వరకూ ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో ఆయనకు స్వల్ప ఊరట లభించినప్పటికీ, కేసులో విచారణ, దర్యాప్తు ప్రక్రియ కొనసాగనుంది.
ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.