Phone Tapping Case: తెలంగాణలో పెద్ద చర్చకు దారి తీసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అతి ముఖ్యమైన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ముఖ్య నిందితుడు (ఏ1) అయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వెంటనే సిట్ (SIT) అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ వచ్చింది. అయితే, తాజా తీర్పులో ఆ రక్షణను తొలగించి, కేసు దర్యాప్తు కోసం ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫు లాయర్లు, ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించట్లేదని, కీలకమైన డాటాను మొత్తం నాశనం చేశారని కోర్టుకు పదేపదే చెప్పారు. ముఖ్యంగా, ఆయన వాడిన 36 డివైజ్‌లను పూర్తిగా పగలగొట్టి, నాశనం చేశారని ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. డివైజ్‌ల పాస్‌వర్డ్‌లను మార్చినా, ఐ-క్లౌడ్ లేదా ఇతర చోట్ల ముఖ్యమైన సమాచారం దొరకలేదని, అంతా తొలగించబడిందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ప్రభాకర్ రావు ఇప్పటివరకు దర్యాప్తుకు సహకరించలేదని నిర్ధారించింది. అందువల్ల, కేసును మరింత లోతుగా విచారించడానికి, కచ్చితంగా ఆయనను కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ, వెంటనే సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ప్రభాకర్ రావు తరఫు సీనియర్ లాయర్ రంజిత్ కుమార్, తమ క్లయింట్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే, కొన్ని నిబంధనల ప్రకారం డివైజ్‌లను పారేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ప్రభాకర్ రావు వయసులో పెద్దవారు కాబట్టి, విచారణ సమయంలో ఆయన గౌరవానికి ఎటువంటి భంగం కలిగించకూడదని సుప్రీంకోర్టు సిట్‌ను గట్టిగా ఆదేశించింది. ఆయనను శారీరకంగా హింసించకూడదని, హాని కలిగించకుండా జాగ్రత్తగా విచారించాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, తదుపరి విచారణ వచ్చే శుక్రవారం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటివరకు, కేసు ఇప్పుడు ఏ స్థితిలో ఉందో చెప్పే నివేదికను సిట్, తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

