Petrol Price Hike

Petrol Price Hike: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు!

Petrol Price Hike: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ చమురు సంస్థలు వాహనదారులకు షాకిచ్చాయి. ముఖ్యంగా ప్రీమియం రకం పెట్రోల్ ధరలను లీటరుకు రూ. 2 నుండి రూ. 2.30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాపై ప్రభావం పడటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పెరిగిన ఈ కొత్త ధరలు ఈరోజునుంచే అమలులోకి వచ్చాయి.

ప్రస్తుతం పెరిగిన ధరలు కేవలం ప్రీమియం పెట్రోల్ రకాలకు మాత్రమే వర్తిస్తాయి. హెచ్‌పీ (HP) సంస్థకు చెందిన ‘పవర్’, ఇండియన్ ఆయిల్ (IOC) కి చెందిన ‘XP95’ వంటి ఖరీదైన పెట్రోల్ వాడుతున్న వారు ఇప్పుడు అదనపు భారం మోయక తప్పదు. ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండాలని, మైలేజీ బాగుండాలని కోరుకునే వారు సాధారణంగా ఈ రకమైన పెట్రోల్‌ను వాడుతుంటారు. అయితే, సాధారణ పెట్రోల్ ధరల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగించే అంశం.

ప్రపంచ మార్కెట్‌లో పరిస్థితులను గమనిస్తే, గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై దాడులు జరగడం వల్ల ఉత్పత్తి తగ్గి ఈ వారంలో ధరలు సుమారు 5 శాతం పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల పైననే కొనసాగుతోంది. అమెరికా వంటి దేశాలు ధరలను తగ్గించేందుకు తమ వద్ద ఉన్న నిల్వలను బయటకు తీస్తున్నప్పటికీ, మార్కెట్‌లో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 108.26 డాలర్లుగా నమోదైంది.

భారత ఆర్థిక వ్యవస్థపై ఈ ధరల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అంతర్జాతీయంగా చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటితే, అది మన దేశంలో పెను మార్పులకు దారితీయవచ్చు. ఆ పరిస్థితి వస్తే కేవలం ప్రీమియం మాత్రమే కాకుండా, సాధారణ పెట్రోల్ ధరలను కూడా పెంచడం ప్రభుత్వానికి తప్పనిసరి అవుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *