Perni Nani

Perni Nani: క్యూఆర్‌ కోడ్‌లు మీరే తెచ్చారా?.. నకిలీ మద్యంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం దందా, క్యూఆర్ కోడ్ వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికార పక్షంపై సంచలన ఆరోపణలు చేశారు. కల్తీ మద్యంపై టీడీపీ ప్రభుత్వం ‘డ్రామాలు’ ఆడుతోందని, నిజాలు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

క్యూఆర్ కోడ్ గొప్పలు దేనికి?
సీఎం చంద్రబాబు నాయుడు క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కొత్తగా ప్రవేశపెట్టినట్లు మాట్లాడుతున్నారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. “క్యూఆర్‌ కోడ్లను మీరే కనిపెట్టినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేటప్పుడే క్యూఆర్ కోడ్‌తో ఉండేది. ఇప్పుడు అదేదో ఘనకార్యంలా చెప్తున్నారు,” అని పేర్ని నాని అన్నారు.

అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ విధానాన్ని ఎందుకు తీసేశారని, ఇప్పుడు నకిలీ మద్యం దందా బయటపడ్డాక మళ్లీ ఎందుకు ప్రవేశపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యాపారం చెయ్యి దాటిపోవడంతోనే క్యూఆర్ కోడ్ ‘డ్రామాలు’ ఆడుతున్నారని నాని ఆరోపించారు.

Also Read: Viral News: ఆర్టీసీ బ‌స్సులో 50 ల‌క్ష‌ల బంగారం పోగొట్టుకున్న దంప‌తులు.. తోటి ప్ర‌యాణికుడి నిజాయితీ

17 నెలలు ఏం చేశారు?
“నకిలీ మద్యం ఫ్యాక్టరీలను మేమే పట్టుకున్నాం అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది, ఇంతకాలం ఏం చేస్తున్నారు?” అని పేర్ని నాని నిలదీశారు. టీడీపీ మనుషులే లిక్కర్ షాపుల నుంచి బెల్ట్ షాపుల వరకు నకిలీ మద్యం సరఫరా చేశారని, వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఈ దందా బయటకు వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా తమ వ్యాపారం బయట పడటంతోనే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటున్నారని, రాష్ట్రంలో ఉన్న 3786 మద్యం దుకాణాలకు పర్మిట్ రూంలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు!
సీఎం చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ కమిషనర్ మీనా కూడా రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారని పేర్ని నాని తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం బెల్ట్ షాపులు ఉన్నట్లు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక జయచంద్రారెడ్డి ఉన్నారని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు అతడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

నకిలీ సారా కంపు.. వైసీపీ కుట్ర డ్రామా
కల్తీ మద్యం కంపులో కూరుకుపోయి, “ఇదంతా వైసీపీ కుట్ర” అని సిగ్గులేకుండా అధికార పక్షం మాట్లాడుతోందని నాని మండిపడ్డారు. కల్తీ మద్యం అంశాన్ని ఎలా కవర్ చేయాలో తెలియక సతమతమవుతున్నారని విమర్శించారు.

నకిలీ మద్యం దందాలో ఏ టీడీపీ నాయకుడికి సంబంధం లేదని జనార్ధన్ వీడియో పంపిన తర్వాత కూడా, ఇంతవరకు ఒక్కరికి కూడా ‘రెడ్ కార్నర్ నోటీస్’ ఇవ్వలేదని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే పోలీసులు, వారికి మాత్రం కనిపించటం లేదా అని ప్రశ్నించారు.

అంతా ‘మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా’!
“పెళ్ళికి వెళ్ళి వస్తుంటే రిసీవ్ చేసుకున్నట్లుగా జనార్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీకు నిజాయితీ ఉంటే, మీ ప్రభుత్వాన్ని బద్నాం చేసిన వారిని ఎలా ట్రీట్ చేయాలి?” అని ప్రశ్నించారు.

మొత్తం వ్యవహారం అంతా ‘మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా’ అని, ఆ తర్వాత “నేను వైసీపీ హయం నుంచే చేస్తున్నా” అని జనార్దన్ స్టేట్‌మెంట్ వీడియో తీసి బయటకు వదిలారని ఆయన ఆరోపించారు. “కథ మొత్తం జోగి రమేష్ వైపు తిప్పారు. జనం నమ్ముతారా అని కూడా సిగ్గులేకుండా మాట్లాడుతారు. జోగి రమేష్ చెప్తేనే ఇదంతా చేశారా? ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరో కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు,” అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *