Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్రవ్య వినిమయ బిల్లు–2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో పాటు వ్యాట్ (VAT) సవరణ బిల్లుకు కూడా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని, రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థ, రాజకీయ పరిస్థితులపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పేరుకుపోతున్న కోర్టు కేసుల పట్ల పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసినప్పుడు, లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని గవర్నర్ తన దృష్టికి తెచ్చారని పవన్ గుర్తు చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా, కోర్టుల్లో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం 100 కోర్టు భవనాల నిర్మాణానికి రూ. 349 కోట్లు కేటాయించడం చాలా మంచి నిర్ణయమని ఆయన అభినందించారు.
రాజకీయ అంశాలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వైసీపీ తీరును తప్పుబట్టారు. సభలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ, వైసీపీ నేతలు తాము 1100 మంది ఉన్నట్లుగా అతిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను (ఆర్టికల్ 19, 21) ఇతరులను దూషించడానికి వాడుకోవడం సరికాదని హితవు పలికారు. రాజకీయ నాయకులు తమ తప్పులను దాచుకోవడానికి కులాల వెనుక దాక్కోవడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం ఎంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినా, అది ప్రజలకు సరైన విధంగా చేరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో గవర్నర్ సూచనలను అమలు చేస్తూ, ప్రజలకు మేలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు.
